అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్

  • భారత్ తరపున రెండు టెస్టులకు ప్రాతినిధ్యం
  • వన్డే జట్టులో చోటు సంపాదించుకోలేకపోయిన నదీమ్
  • ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్‌లపై దృష్టి పెడుతున్నట్టు వెల్లడి
  • దేశవాళీ క్రికెట్‌లో ఝార్ఖండ్‌కు ప్రాతినిధ్యం
  • ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నోకు ప్రాతినిధ్యం
టీమిండియా క్రికెటర్ షాబాజ్ నదీమ్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పేశాడు. 34 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ రెండు టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన షాబాజ్ ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లు ఆడాలన్న కోరికను వెలిబుచ్చాడు. రిటైర్మెంట్‌పై చాలాకాలంగా ఆలోచిస్తున్నానని, ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. తనకిప్పుడు టీమిండియాలో చోటు దక్కే అవకాశం లేదని, కాబట్టి తప్పుకుని కుర్రాళ్లకు చోటివ్వాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్‌లు ఆడాలనుకుంటున్నట్టు చెప్పాడు.

దేశవాళీ క్రికెట్‌లో 542 వికెట్లు
దేశవాళీ క్రికెట్‌లో ఝార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించిన నదీమ్ 2004 వరకు 140 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 542 వికెట్లు పడగొట్టాడు. 2019లో రాంచీలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు, 2021లో చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే, వన్డే, టీ20ల్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. భారత్‌కు ఆడిన రెండు టెస్టుల్లో మొత్తం 8 వికెట్లు సాధించాడు.

ఐపీఎల్‌లో మూడు జట్లకు ప్రాతినిధ్యం
ఐపీఎల్‌లో 2011 నుంచి 2018 వరకు ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు, 2019 నుంచి 2021 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2022లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం లభించలేదు. క్రికెట్‌కు రిటైర్మెట్ ప్రకటించిన నదీమ్ తన చిన్ననాటి కోచ్ ఇంతియాజ్ హుస్సేన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే, తనకు ఎంతో సాయం అందించి అండగా నిలిచిన ఇండిగో క్లబ్‌కు చెందిన ఎస్ రహమాన్‌ను మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు. వారి వల్ల, తన కుటుంబ సభ్యుల సహకారం వల్లే ఇన్నాళ్లపాటు క్రికెట్‌లో కొనసాగ గలిగానని షాబాజ్ చెప్పాడు.


More Telugu News