రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో... సన్నాసి అని రేవంత్ రెడ్డి అంటున్నట్లుగా ఉంది!: కేటీఆర్

  • వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వ్యాఖ్య
  • ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ సీఎం... బీజేపీ ప్రధానిని ప్రశంసిస్తారా? అని ప్రశ్న
  • నువ్వే మళ్లీ ప్రధాని అవుతావని మోదీకి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఉందని వ్యాఖ్య
వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని... ఈ మాట నేను పక్కాగా చెబుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రధానిని ప్రశంసించడం ద్వారా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో... సన్నాసి అంటున్నట్లుగా ఉందన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి బడే భాయ్ అంటున్నారని... మరి ఆ బడే భాయ్... ఈ ఛోటే‌ భాయ్‌కి ఏమిచ్చాడో... చెవిలో ఏం చెప్పాడో తనకు తెలియదు కానీ నిన్నటి ఆదిలాబాద్ సభతో తెలంగాణలో రేవంత్ రెడ్డి భవిష్యత్తు, కాంగ్రెస్ భవిష్యత్తు కనిపిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్లు... అసోంలో జరిగినట్లు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఆయన ఒక ఏక్‌నాథ్ షిండే... మరో హిమంత బిశ్వ శర్మ... ఇక్కడ పుట్టి... కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొంద పెడతారన్నారు. తాను ఈ మాటను ఆషామాషీగా చెప్పడం లేదన్నారు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... బడేభాయ్ అని ఒక్క మాట మాత్రమే అనలేదని... భవిష్యత్తులో మీ ఆశీర్వాదం మాపై ఉండాలని చెప్పడం ఏమిటన్నారు.

మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పడం ద్వారా భవిష్యత్తులోనూ మోదీయే ప్రధాని అని చెప్పకనే చెప్పారన్నారు. ఎన్నికలు రెండు నెలలు కూడా లేవని ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధానిని ప్రశంసించడం ఏమిటన్నారు. మా రాహుల్ గాంధీ వేస్ట్ కేసు... గెలిచేది లేదు... ఏమీ లేదు.. మళ్లీ నువ్వే ప్రధాని అని మోదీకి చెప్పినట్లుగా ఉందన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైనా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీ ప్రధానిని బడే భాయ్ అని అంటారా? అని ప్రశ్నించారు. మెడ మీద తలకాయ ఉన్న ఎవరూ కూడా ఇలా మాట్లాడరన్నారు. వారిది దివాళాకోరు రాజకీయమని విమర్శించారు.

'అంటే బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో... రాహుల్ గాంధీ సన్నాసి... వేస్ట్ ఫెలో... ఆయనతో కాదు... నువ్వే మళ్లీ ప్రధాని అవుతావు అని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే ఏం చెప్పాలి?' అని కేటీఆర్ అన్నారు.


More Telugu News