మీ బిడ్డనంటున్నాడు.. జాగ్రత్త.. ప్రజలను హెచ్చరించిన లోకేశ్

  • జగన్‌పై మరోమారు ధ్వజమెత్తిన లోకేశ్
  • గత ఐదేళ్లలో జగన్ సొంత కంపెనీలు కళకళలాడుతుంటే రాష్ట్ర ఖజానా మాత్రం దివాలా తీసిందని ఆగ్రహం
  • సచివాలయాన్ని రూ. 370 కోట్లకు, ఖనిజ సంపదను రూ. 7 వేల కోట్లకు తాకట్టు పెట్టారని మండిపాటు
  • ఇక మిగిలింది ప్రజలేనని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
కనిపించిన వేదికలపై మీ బిడ్డనంటూ ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటల వెనక ఆంతర్యాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రజలను హెచ్చరించారు. గత ఐదేళ్లుగా ఆయన సొంత కంపెనీలు అన్నీ వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉన్నాయని, రాష్ట్ర ఖజానాను మాత్రం అప్పులతో దివాలా తీయించారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క కంపెనీని తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయిన సీఎం.. అప్పుల్లో మాత్రం పీహెచ్‌డీ చేశారని దుయ్యబట్టారు.

సచివాలయాన్ని రూ. 370 కోట్లకు, ఖనిజ సంపదను రూ. 7 వేల కోట్లకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుబాబులను ఇప్పటికే తాకట్టుపెట్టి రూ. 33 వేల కోట్ల అప్పు తెచ్చారని, జగన్ జమానాలో ఇక మిగిలింది 5 కోట్ల మంది ప్రజలు మాత్రమేనని పేర్కొన్నారు. ఇప్పుడేమో తాను మీ బిడ్డనేనని అంటున్నాడని, కాబట్టి ఆయన మాటల వెనక ఉన్న అర్థాన్ని గ్రహించి వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు లోకేశ్ తెలిపారు.


More Telugu News