ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని కోల్పోయిన ఎలాన్ మస్క్

  • టెస్లా షేర్ల విలువ సోమవారం భారీగా క్షిణించడంతో కరిగిన మస్క్ సంపద
  • 197.7 బిలియన్ డాలర్లతో రెండవ స్థానానికి దిగజారిన వైనం
  • 200.3 బిలియన్ డాలర్లతో తిరిగి అగ్రస్థానంలో నిలిచిన అమెజాన్ సహవ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్
ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ అధిపతి ఎలాన్ మస్క్ ప్రపంచ సంపన్నుడి హోదాను కోల్పోయారు. టెస్లా కంపెనీ షేర్ల విలువ సోమవారం ఏకంగా 7.2 శాతం క్షీణించడంతో ఆయన సంపద విలువ 197.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీలో 200.3 బిలియన్ డాలర్లతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచ నంబర్ 1 కుబేరుడిగా అవతరించారు. 

సోమవారం టెస్లా ఇంక్‌లో షేర్లు 7.2% పడిపోయిన తర్వాత బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో జెఫ్ బెజోస్‌కు మస్క్ తన స్థానాన్ని కోల్పోయాడు. మస్క్ నికర విలువ ఇప్పుడు $197.7 బిలియన్లు; బెజోస్ సంపద 200.3 బిలియన్ డాలర్లు. గత 9 నెలల వ్యవధిలో ఎలాన్ మస్క్ రెండవ స్థానానికి పడిపోవడం ఇదే తొలిసారి. 2021లో వీరిద్దరి సంపద మధ్య భారీగా 142 బిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉంది. అయితే గత కొంతకాలంగా టెస్లా షేర్లు భారీగా క్షీణిస్తుండడం మస్క్ వ్యక్తిగత సంపదను కరిగించివేస్తోంది. 2021లో గరిష్ఠ స్థాయి నుంచి ప్రస్తుతం ఏకంగా 50 శాతం మేర షేర్లు పతనమయ్యాయంటే మస్క్ సంపద ఏ స్థాయిలో క్షిణించిందో గమనించవచ్చు. చైనాలోని కంపెనీ ఉత్పత్తి క్రితం ఏడాదితో పోల్చితే భారీగా తగ్గిందనే రిపోర్టులతో టెస్లా షేర్లు సోమవారం భారీగా కుంగాయి. 

కాగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి కాదు. 2017లో తొలిసారి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించి నంబర్ 1 స్థానంలో నిలిచారు. అయితే 2021లో టెస్లా షేర్లు క్రమంగా బలపడడంతో మస్క్ సంపద అమాంతం పెరిగిపోయింది. దీంతో బెజోస్ వెనుకబడ్డారు. తిరిగి మళ్లీ ఇప్పుడే అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. మరోవైపు ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ వస్తువుల ఉత్తత్తి కంపెనీ ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 197.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడవ స్థానంలో నిలిచారు.


More Telugu News