తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు షెడ్యూల్ ఇదే

  • ఉదయం 10 గంటలకు సంగారెడ్డి చేరుకోనున్న ప్రధాని
  • 10.45 గంటలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • 11.20 గంటలకు పఠాన్‌చెరులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండవ రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన సంగారెడ్డి చేరుకోనున్నారు. 10.45 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెడతారు. రూ.6,800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పటేల్‌గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వర్చువల్‌గా ఆయన పాల్గొంటారు. రూ.1409 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు. సంగారెడ్డి క్రాస్ రోడ్స్ నుంచి మదీనాగూడ వరకు రూ.1298 కోట్లతో ఎన్‌హెచ్-65ని ఆరు లేన్ల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇక మెదక్ జిల్లాలో రూ.399 కోట్లతో ఎన్‌హెచ్765డీ మెదక్-ఎల్లారెడ్డి హైవే విస్తరణ, రూ.500 కోట్లతో ఎల్లారెడ్డి-రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

అనంతరం జిల్లాలోని పఠాన్‌చెరులో 11.20 గంటలకు నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 2 వేల మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. సభాస్థలికి వచ్చేవారు ఎలాంటి వస్తువులు తీసుకురావొద్దని అధికారులు సూచించారు. కాగా ప్రధాని మోదీ నిన్న (సోమవారం) ఆదిలాబాద్‌లో పర్యటించారు. అనంతరం తమిళనాడు వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.


More Telugu News