ఏపీ సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టడంపై మోదీకి రఘురామకృష్ణరాజు లేఖ
- హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు రూ. 350 కోట్లకు తాకట్టు పెట్టారన్న రఘురాజు
- ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని వ్యాఖ్య
- సచివాలయాన్ని తాకట్టు పెడుతుంటే సీఎస్ ఎలా ఒప్పుకున్నారని మండిపాటు
ఆర్థిక అవసరాల కోసం ఏపీ సెక్రటేరియట్ ను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిన అంశం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. రూ. 350 కోట్లకు సచివాలయాన్ని ఏపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. పీఎంను జగన్ కలిసే లోపే తాను లేఖ రాశానని చెప్పారు. ఏ ప్రభుత్వ బ్యాంకు కూడా సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టుకోవడానికి ముందుకు రాకపోవడంతో... ప్రైవేట్ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు తాకట్టు పెట్టుకుందని తెలిపారు. రేపు వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంకు యాజమాన్యం ఎవరినీ సెక్రటేరియట్ లోపలకు రానివ్వదని అన్నారు. సెక్రటేరియట్ ను తాకట్టు పెడుతుంటే చీఫ్ సెక్రటరీ ఎలా ఒప్పుకున్నారని మండిపడ్డారు.