ఏపీలో మార్చి నుంచే వేసవి భగభగలు

  • ఎల్ నినో ప్రభావంతో ఎండలు ముందే వస్తున్నాయన్న ఏపీఎస్డీఎంఏ ఎండీ కూర్మనాథ్
  • ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోతాయని వెల్లడి
  • అదే సమయంలో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశముందని వివరణ
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన 
తెలంగాణలో ఇప్పటికే ఎండలు ముదురుతున్నాయి. ఏపీలోనూ మార్చి నుంచే వేసవి భగభగలు తప్పవని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ఎల్ నినో కారణంగా మార్చి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోతాయని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 

వేడిగాలులు కూడా వీస్తాయని, అందువల్ల వడదెబ్బ బారినపడే అవకాశం ఉందని వివరించారు. ఎండలపై సమాచారం కోసం 112, 1070, 1800 425 0101 టోల్ ఫ్రీ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. సెల్ ఫోన్లకు వడగాడ్పుల హెచ్చరిక సందేశాలు పంపిస్తామని కూర్మనాథ్ పేర్కొన్నారు. వేసవి ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. 

కర్నూలు, అనంతపురం, కడప, సత్యసాయి జిల్లాల్లో ఎండలు మండిపోతాయని... ప్రకాశం, నెల్లూరు, కోనసీమ, అల్లూరి,  విశాఖ, విజయనగరం జిల్లాల్లో కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు. అదే సమయంలో మండే ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల కారణంగా అకాల వర్షాలు కురుస్తాయని, పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

దినసరి కూలీలు మధ్యాహ్నం కల్లా పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకోవాలని చెప్పారు. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లాలనుకునేవారు గొడుగులు తీసుకెళ్లడం వల్ల ఎండ నుంచి రక్షణ లభిస్తుందని అన్నారు. 

శరీరంలో ద్రవాల స్థాయి పడిపోకుండా చూసుకోవాలని, నీరు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీరు తాగుతుండాలని తెలిపారు. ఎండల్లో బయటికి వెళ్లొచ్చినప్పుడు శరీరంలో లవణాలు కోల్పోకుండా ఓఆర్ఎస్ ద్రావణం, లస్సీ, నిమ్మ నీరు వంటి పానీయాలు తాగాలని వెల్లడించారు.


More Telugu News