బీజేపీ తొలి జాబితాలో గడ్కరీ పేరు లేకపోవడంపై ఉద్దవ్ ఠాక్రే ఆగ్రహం

  • బీజేపీ తొలి జాబితాలో గ‌డ్క‌రీ పేరు లేక‌పోవ‌డం త‌న‌ను ఆశ్చర్యానికి గురి చేసిందన్న ఠాక్రే
  • ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పూర్తి చేయ‌డంలో గ‌డ్క‌రీతో తాను కలిసి పని చేశానని వెల్లడి
  • ప్రతిపక్షాలను అణచివేసే రాజకీయాలు సరికాదని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు హితవు
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థులతో బీజేపీ రెండు రోజుల క్రితం జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు లేదు. దీంతో శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తొలి జాబితాలో గ‌డ్క‌రీ పేరు లేక‌పోవ‌డం త‌న‌ను ఆశ్చర్యానికి గురి చేసిందని ఠాక్రే అన్నారు. త‌న తండ్రి బాల్ ఠాక్రే త‌ల‌పెట్టిన ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పూర్తి చేయ‌డంలో గ‌తంలో గ‌డ్క‌రీతో తాను కలిసి ప‌నిచేసిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు.

ఉద్ధవ్ ఇంకా మాట్లాడుతూ... ప్రతిపక్షాలను అణచివేసే రాజకీయాలు ప్రధాని మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సరికాదన్నారు. న‌కిలీ హామీల‌కు గ్యారంటీ అనే పేరు పెట్టి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని విమర్శించారు. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కృపాశంక‌ర్ సింగ్‌ను అందలమెక్కించారని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ నేత‌ల‌ను ప్రాసిక్యూట్ చేసే తీరును ఇది ఎత్తి చూపుతోందన్నారు.


More Telugu News