కోర్టులో లొంగిపోయిన సీనియర్ నటి జయప్రద
- ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ జయప్రదపై కేసులు
- కోర్టు విచారణకు హాజరుకాని జయప్రద
- అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించిన కోర్టు
సీనియర్ సినీ నటి బీజేపీ మాజీ ఎంపీ జయప్రద ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. గత ఎన్నికల సమయంలో ఎలెక్షన్ కోడ్ ను ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసుల విచారణకు ఆమె హాజరు కాలేదు. పలుమార్లు ఆమెకు కోర్టు నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. దీంతో, ఫిబ్రవరి 27న ఆమెకు సీఆర్పీసీ 82 కింద మరో నాన్ బెయిలబుల్ వారెంట్ ను రాంపూర్ లోని ఎంపీ / ఎమ్మెల్యే కోర్టు జారీ చేసింది. ఆమె ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. జయప్రద పరారీలో ఉన్నట్టు కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జయప్రద కోర్టులో లొంగిపోయారు.