వంశపారంపర్యంగా క్యాన్సర్ బారినపడిన ఇస్రో చైర్మన్ సోమనాథ్

  • చంద్రయాన్-3 సమయంలో సోమనాథ్ కు అనారోగ్యం
  • ఆ సమయంలో తనకు అవగాహన లేదన్న సోమనాథ్
  • ఆదిత్య ఎల్1 ప్రయోగం రోజునే పరీక్షలు చేయించుకున్నానని వెల్లడి
  • క్యాన్సర్ అని నిర్ధారణ అయిందని వివరణ
  • ప్రస్తుతం క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నానని స్పష్టీకరణ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గతేడాది సెప్టెంబరు 2న సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్1 మిషన్ ను ప్రయోగించింది. అయితే, అదే రోజున తాను క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం నిర్ధారణ అయిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, క్యాన్సర్ నుంచి కోలుకున్నానని తెలిపారు. కడుపులో కణితి పెరిగిందని, ఈ తరహా క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చిందని ఆయన వివరించారు. 

"చంద్రయాన్-3 ప్రయోగం సమయంలోనే అనారోగ్య సమస్యలు తలెత్తడాన్ని గుర్తించాను. అయితే ఆ అనారోగ్యానికి కారణం ఏంటన్నది నాకు అప్పుడు తెలియలేదు. ఆదిత్య ఎల్1 ప్రయోగం రోజున ఉదయాన్నే వైద్య పరీక్షలు చేయించుకున్నాను. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్టు తేలడంతో చెన్నై వెళ్లి మరిన్ని పరీక్షలు చేయించుకున్నాను. దాంతో నేను బాధపడుతున్నది క్యాన్సర్ తో అని నిర్ధారణ అయింది. 

నాకు క్యాన్సర్ అని తెలియగానే మా కుటుంబం, నా ఉద్యోగ సహచరులు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నా. కీమోథెరపీ చికిత్స కూడా తీసుకున్నాను. నేను ఆసుపత్రిలో ఉన్నది కేవలం నాలుగు రోజులే. మొదట్లో  భయపడ్డాను కానీ, క్యాన్సర్ కు చికిత్స ఉందన్న విషయం ఇప్పుడు నాకు అర్థమైంది" అని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ వివరించారు.


More Telugu News