ప్రధాని మోదీని పెద్దన్న అని సంబోధించిన రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

  • తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని మోదీ... పెద్దన్న ఎలా అవుతారని ప్రశ్న
  • సీఎం వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేననే విషయం తేటతెల్లమవుతోందన్న కవిత
  • కొత్తగా తీసుకువచ్చిన జీవో 3ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్
ఆదిలాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంబోధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని మోదీ... పెద్దన్న ఎలా అవుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేననే విషయం తేటతెల్లమవుతోందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించలేదని ఎన్డీయే ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ 3ని తీసుకు వచ్చిందని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోకు నిరసనగా ఈ నెల ఎనిమిదో తేదీ మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్‌లో నల్ల రిబ్బన్లతో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మహిళలను, అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. రోస్టర్ విధానంతో మహిళలకు ఎక్కువమందికి ఉద్యోగాలు రాకపోయే ప్రమాదం ఉందన్నారు.


More Telugu News