నాకింత అన్నం ఉంటే చాలు: కన్నీళ్లు పెట్టుకున్న అజయ్ ఘోష్

  • బాల్యమంతా కష్టాలతో గడిచిందన్న అజయ్ ఘోష్ 
  • అనేక అవమానాలు ఎదురయ్యాయని వెల్లడి 
  • తన ఊరు తనని ప్రభావితం చేసిందని వ్యాఖ్య 
  • తాను అన్నం తినేవరకూ తల్లిదండ్రులు ఆగేవారంటూ కన్నీళ్లు  
అజయ్ ఘోష్ .. నాటక రంగం నుంచి వచ్చిన నటుడు. టీవీ సీరియల్స్ చేస్తూ, సినిమాల దిశగా అడుగులు వేసిన నటుడు. తన కళ్లతో .. వాయిస్ తో కట్టిపడేయగల నటన ఆయన సొంతం. అలాంటి అజయ్ ఘోష్, తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 

"జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను .. ఎన్నో అవమానాలు .. బాధలు చూశాను. నా వెనుక .. నా గురించి చాలా దారుణంగా మాట్లాడుకోవడం విన్నాను. ఇలాంటి సంఘటనలు ఎన్ని ఎదురైనా నాకు మా ఊరు అంటే ఇష్టం. ఎందుకంటే మా ఊరు నాకు జీవితాన్ని నేర్పించింది .. నన్ను ఎంతగానో ప్రభావితం చేసి, నేను ఎదగడానికి ఉపాయోగపడింది. అందుకే షూటింగులు లేకపోతే, ఇప్పటికీ మా ఊళ్లోనే ఉంటాను" అని అన్నారు. 

" నా చిన్నతనం గురించి అడిగితే అన్నీ బాధలను గురించే నేను చెప్పవలసి ఉంటుంది. నేను కొంచెం తిండిపోతును .. అన్నం ఎక్కువగా తింటాను .. అన్నం ఒక్కటి ఉంటే చాలు నాకు. అందువలన నేను తిన్న తరువాత మిగిలితే తిందామని మా అమ్మానాన్నలు అంతవరకూ ఆగేవారు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఎక్కడున్నా ఇంత అన్నం దొరికేలా చేసిన భగవంతుడికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటాను" అని చెప్పారు.


More Telugu News