కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మనే ఎందుకు కెప్టెన్ గా నియమించారో చెప్పిన గంగూలీ

  • 2022లో టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ
  • కోహ్లీ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టిన హిట్ మ్యాన్
  • రోహిత్ శర్మలో తాను అపారమైన ప్రతిభను చూశానన్న గంగూలీ
  • వరల్డ్ కప్ లో అతడు జట్టును నడిపించిన తీరే అందుకు నిదర్శనమని వెల్లడి
రెండేళ్ల కిందట టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కోల్పోయిన సంగతి తెలిసిందే. కోహ్లీ స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియా పగ్గాలు చేపట్టాడు. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉన్నాడు. గంగూలీతో విభేదాల కారణంగానే కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్నాడని ప్రచారం జరిగింది. దీనిపై గంగూలీ గతంలో ఓసారి స్పందించారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోహ్లీని బీసీసీఐ కోరిందని గంగూలీ అప్పట్లోనే వివరణ ఇచ్చారు. 

ఇదే అంశం నేపథ్యంలో గంగూలీ మరోసారి స్పందించారు. కోహ్లీ స్థానంలో రోహిత్ నే ఎందుకు కెప్టెన్ గా నియమించారో వెల్లడించారు. 

"రోహిత్ శర్మలో అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నట్టు గుర్తించాను. నా హయాంలోనే రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా నియమితుడయ్యాడు. అతడు జట్టును నడిపిస్తున్న తీరు పట్ల నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు. అతడిని నేను టీమిండియా కెప్టెన్ ను చేయడానికి గల కారణం అతడిలోని ప్రతిభే. రోహిత్ శర్మ ఇటీవలి వరల్డ్ కప్ లో జట్టును ఎలా నడిపించాడో అందరూ చూశారు. భారత్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో ఓడినప్పటికీ టీమిండియానే ఆ టోర్నీలో అత్యుత్తమ జట్టు అని నమ్ముతాను. మరలాంటప్పుడు రోహిత్ శర్మ మంచి కెప్టెనే కదా. అతడు సాధించిన ఐపీఎల్ ట్రోఫీలే ఆ విషయం చెబుతాయి" అని గంగూలీ వివరించారు.


More Telugu News