వరుసగా రెండోసారి పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్

  • ఇటీవలి ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్, పీపీపీ కూటమి విజయం
  • నేడు పాక్ పార్లమెంటులో ప్రధాని ఎన్నికకు ఓటింగ్
  • షెహబాజ్ షరీఫ్ కు 201 మంది సభ్యుల మద్దతు
  • పాక్ పార్లమెంటులో మొత్తం 336 సీట్లు
  • ప్రధాని అయ్యేందుకు 169 మంది సభ్యుల మద్దతు 
పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ (72) వరుసగా రెండోసారి పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. పాకిస్థాన్ పార్లమెంటులో షెహబాజ్ షరీఫ్ కు 201 మంది సభ్యుల మద్దతు లభించింది. ప్రధాని అయ్యేందుకు 169 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ఆయనకు అంతకంటే ఎక్కువ మంది మద్దతు పలికారు. 

ఇటీవల పలు వివాదాల నడుమ పాక్ లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్, పీపీపీ కూటమి విజయం సాధించింది. 

ప్రధాని నియామకం కోసం ఇవాళ పాక్ పార్లమెంటులో ఓటింగ్ జరిగింది. అందులో అత్యధికులు షెహబాజ్ షరీఫ్ నాయకత్వాన్ని బలపరిచారు. ఈ ఓటింగ్ లో ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ అభ్యర్థి ఉమర్ అయూబ్ ఖాన్ కు కేవలం 92 మంది సభ్యుల మద్దతు లభించింది. 

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 336. ఇటీవలి ఎన్నికల్లో షెహబాజ్ సోదరుడు, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా గెలిచినప్పటికీ, కూటమి మాత్రం ప్రధానిగా షెహబాజ్ అభ్యర్థిత్వాన్ని బలపరిచింది.


More Telugu News