మైలవరంలో కలిసి పనిచేస్తామని ప్రకటించిన దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు

  • మైలవరంలో ఆసక్తికర రాజకీయాలు
  • నిన్న టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
  • నేడు చేయి చేయి కలిపిన దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు
  • ఇప్పటివరకు టీడీపీలో రెండు వర్గాలుగా ఉన్న ఉమా, బొమ్మసాని
  • టీడీపీ విజయమే లక్ష్యమని నేడు ఉమ్మడి ప్రకటన
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో మైలవరం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీలో అగ్రనేతగా కొనసాగుతున్న దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నియోజకవర్గానికి చెందిన నేత. ఇప్పటికే అక్కడ దేవినేని ఉమా వర్గం, బొమ్మసాని సుబ్బారావు వర్గం పేరిట టీడీపీలో రెండు వర్గాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా టీడీపీలోకి రావడంతో మైలవరం రాజకీయాలు మరింత వాడీవేడిగా మారాయి. టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది టీడీపీ అధినాయకత్వానికి నిజంగానే ఓ సవాలుగా మారింది.

ఈ నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. మైలవరంలో కలిసి పనిచేస్తామని దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ప్రకటించారు. లోకేశ్ పాల్గొనే శంఖారావం సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని ఉమ్మడిగా ప్రకటన చేశారు. అంతేకాదు, రేపు బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ సభలోనూ పాల్గొంటామని ఇరువురూ వెల్లడించారు. త్వరలో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం ఖాయమని దేవినేని ఉమా అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళతామని బొమ్మసాని చెప్పారు.


More Telugu News