రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన.. తల్లి నుంచి ఫోన్ రావడంతో బతికిపోయిన టెకీ!

  • ఏడాది కాలంగా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కుమార్ అలంకృత్
  • ఇడ్లీ తిని దోశ కోసం ఎదురుచూస్తుండగా తల్లి నుంచి ఫోన్
  • మాట్లాడేందుకు బయటకు రాగానే పేలుడు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటన దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పలు నగరాల్లో తనిఖీలు చేపట్టారు. తాజా ఘటనకు 2022లో మంగళూరులో జరిగిన కుక్కర్ పేలుడుకు సంబంధం ఉందనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. 

బెంగళూరు వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని ఈ కేఫ్‌ ఐటీ ఉద్యోగులకు అడ్డా. నిత్యం ఎంతోమంది ఐటీ ప్రొఫెషనల్స్ లంచ్ అవర్‌లో కేఫ్‌కు వచ్చి గడుపుతుంటారు. ఎప్పటిలానే పేలుడు జరిగిన రోజు కూడా ఉద్యోగులు వచ్చి టిఫిన్ చేసి, కాఫీ తాగి వెళ్లారు. ఒక టెకీ మాత్రం కొన్ని క్షణాల వ్యవధిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.  

శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో పేలుడు సంభవించింది. బీహార్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుమార్ అలంకృత్ (24) పేలుడుకు కొన్ని క్షణాల ముందు కేఫ్ నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు. కుమార్ కేఫ్‌లో టిఫిన్ తింటుండగా తల్లి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఫోన్ మాట్లాడేందుకు బయటకు వచ్చాడు. ఆ వెంటనే బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. 

తాను ఇడ్లీ తినడం పూర్తి చేసి దోశ అర్డర్ చేశానని, అదే సమయంలో తన తల్లి ఫోన్ చేయడంతో బయటకు వచ్చి మాట్లాడుతుండగా పేలుడు సంభవించిందని కుమార్ గుర్తు చేసుకున్నాడు. ఫోన్ మాట్లాడేందుకు కేఫ్ నుంచి 10-15 మీటర్ల దూరం వచ్చి ప్రాణాలు దక్కించుకున్నానని తెలిపాడు. తాను ఏడాది కాలంగా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని, రామేశ్వరం కేఫ్‌కు తరచూ వెళ్తుంటానని పేర్కొన్నాడు.


More Telugu News