మార్క్‌రమ్‌కు ఉద్వాసన.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఆసీస్ సారథి!

  • గతేడాది పరాభవంతో జట్టులో పలుమార్పులు చేసిన సన్‌రైజర్స్
  • వేలంలో రూ. 20.5 కోట్లు వెచ్చించి కమిన్స్‌ను సొంతం చేసుకున్న హైదరాబాద్
  • కోచ్ బ్రయాన్ లారా స్థానంలో డేనియల్ వెటోరీ
గత ఐపీఎల్ సీజన్‌లో దారుణ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రక్షాళన ప్రారంభించింది. సారథి మార్కరమ్‌కు ఉద్వాసన పలికి అతడి స్థానంలో ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచకప్ అందించిపెట్టిన సారథి పాట్ కమిన్స్‌కు పగ్గాలు అప్పగించనున్నట్టు తెలిసింది. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్స్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం ఏకంగా రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అది రెండో అత్యధిక ధర. అతడికి కెప్టెన్సీ అప్పగించేందుకే అంత ధర పెట్టి అతడిని కొనుగోలు చేసినట్టు తెలిసింది.

గత సీజన్‌లో మార్కరమ్ సారథ్యంలోని జట్టు 14 మ్యాచుల్లో నాలుగు విజయాలు మాత్రమే సాధించింది జాబితాలో కింది నుంచి తొలి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో జట్టులో పలు మార్పులు చేసిన సన్‌రైజర్స్ జట్టు.. ప్రధాన కోచ్ బ్రయాన్ లారాను తప్పించి అతడి స్థానంలో ఆస్ట్రేలియా జట్టు సహాయక కోచ్‌ డేనియల్ వెటోరీని నియమించింది.

అక్కడ విజయాలు.. ఇక్కడ పరాజయాలు
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ జట్టుకు కెప్టెన్సీగా ఉన్న మార్కరమ్ వరుసగా రెండోసారి కూడా జట్టును విజేతగా నిలిపాడు. అయినప్పటికీ ఐపీఎల్‌లో మాత్రం జట్టుకు కష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించి కమిన్స్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, జట్టు బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ ఈ సీజన్‌కు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. అతడి స్థానంలో న్యూజిలాండ్ పేసర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను బౌలంగ్ కోచ్‌గా నియమించినట్టు సమాచారం.


More Telugu News