వేలిముద్రలను సేకరించేందుకు పర్యావరణహిత స్ప్రే.. శాస్త్రవేత్తల ఆవిష్కరణ

  • షాంఘై నార్మల్, బాత్ వర్సిటీల పరిశోధకులు ఆవిష్కరణ
  • వేలిముద్రల సేకరణకు పర్యావరణహిత స్ప్రే డిజైన్ రూపొందించిన వైనం
  • డీఎన్ఏ విశ్లేషణకు ఆటంకం కలిగించని స్ప్రేను డిజైన్ చేసిన శాస్త్రవేత్తలు
 ఫోరెన్సిక్ దర్యాప్తులో భాగంగా వేలిముద్రల సేకరణకు సురక్షితమైన ఫ్లోరిసెంట్ స్ప్రేను చైనా, బ్రిటన్‌లకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. నీటిలో కరిగిపోయే ఈ స్ప్రే విషతుల్యం కాదని అన్నారు. వస్తువులపై కంటికి కనిపించకుండా ఉండే వేలిముద్రలు ఈ స్ప్రే చల్లగానే స్పష్టంగా కనిపిస్తాయి. 

వస్తువులను తాకినప్పుడు స్వేదం కారణంగా పడే వేలిముద్రలను శాస్త్ర పరిభాషలో లేటెంట్ ఫింగర్ ప్రింట్స్ అంటారు. నేర దర్యాప్తులో ఇవి చాలా కీలకం. వీటిని సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు వస్తువులపై విషతుల్య పొడిని జల్లుతుంటారు. ఈ పొడి పర్యావరణానికి హానికరమే కాకుండా వస్తువులపై ఉండే డీఎన్ఏ ఆనవాళ్లను కూడా దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలోనే చైనా శాస్త్రవేత్తలు పర్యావరణహిత స్ప్రేను రూపొందించారు. 

చైనాలోని షాంఘై నార్మల్ విశ్వవిద్యాలయం, బ్రిటన్‌లోని బాత్ వర్సిటీ పరిశోధకులు అద్దకం స్ప్రేను అభివృద్ధి చేశారు. ఎల్ఎఫ్‌పీ ఎల్లో, ఎఫ్ఎఫ్‌పీ రెడ్ రంగుల్లో దీన్ని రూపొందించారు. అవి వేలిముద్రల్లో కొన్ని రుణావేశ పరమాణువులతో బంధాన్ని ఏర్పరుస్తాయి. ఆ తరువాత ఫ్లోరిసెంట్ కాంతిని వెదజల్లుతాయి. జెల్లీ ఫిష్‌లో కనిపించే ఒక ఫ్లోరిసెంట్ ప్రొటీన్ ఆధారంగా తాజా అద్దకాలను శాస్త్రవేత్తలు తయారు చేశారు. వీటితో డీఎన్ఏ విశ్లేషణకు ఎటువంటి అడ్డంకులు ఉండవన్నారు.


More Telugu News