బెంగాల్‌లో ఎప్పుడు అరెస్ట్ జరగాలో కూడా నేరగాళ్లే నిర్ణయించుకునే పరిస్థితి ఉంది: ప్రధాని మోదీ

  • రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ధీమా
  • మమతా బెనర్జీ ప్రభుత్వం తీరు పట్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్య
  • రాష్ట్రంలో బాధితుల సమస్యలను బెంగాల్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ
పశ్చిమ బెంగాల్‌లో ఎప్పుడు అరెస్ట్ జరగాలో కూడా నేరగాళ్లే నిర్ణయించుకునే పరిస్థితి ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లోని నదియా జిల్లా కృష్ణా నగర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సభకు వచ్చిన వారి అభిమానం చూస్తుంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే 400కు పైగా స్థానాలు గెలుస్తుందనే ఆత్మవిశ్వాసం మరింత బలపడుతోందన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం తీరు పట్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.

దౌర్జన్యాలు, రాజవంశ రాజకీయాలు, ద్రోహాలకు టీఎంసీ పర్యాయపదంగా నిలిచిందని విమర్శించారు. రాష్ట్రంలో బాధితుల సమస్యలను బెంగాల్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక్కడ వేధింపులకు గురైన తల్లులు, సోదరీమణులు న్యాయం కోసం పోరాడుతుంటే వారికి అండగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిందితుల పక్షాన నిలబడుతోందన్నారు.


More Telugu News