అది ప్రెజర్ కుక్కర్ బాంబు... టైమర్ సెట్ చేసి వెళ్లిపోయాడు: సిద్ధరామయ్య

  • బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు
  • నిందితుడు బస్ లో ప్రయాణించి కేఫ్ కు చేరుకున్నాడన్న సిద్ధరామయ్య
  • ఇలాంటి విషయాల్లో బీజేపీ రాజకీయాలు బాధాకరమని వ్యాఖ్య
బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనతో దేశంలోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... ఈ ఘటనలో నిందితుడు ప్రెజర్ కుక్కర్ బాంబు వాడాడని చెప్పారు. ఈ విషయంలో కూడా బీజేపీ రాజకీయాలు చేస్తుండటం బాధాకరమని అన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బాంబు పేలుళ్లు జరిగాయని... అప్పుడు వాళ్లు బుజ్జగింపు రాజకీయాలు చేశారా? అని ప్రశ్నించారు. ఉగ్రవాద చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో రాజకీయాలు చేయడం తగదని అన్నారు. 

క్యాప్, మాస్క్ ధరించిన వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్ కు చేరుకున్నాడని... రవ్వ ఇడ్లీని ఆర్డర్ చేసి ఒక చోట కూర్చున్నాడని... ఆ తర్వాత బాంబుకు టైమర్ సెట్ చేసి వెళ్లిపోయాడని సిద్ధరామయ్య చెప్పారు. ఘటనకు పాల్పడిన వ్యక్తి ఫొటోలు వచ్చాయని, సాధ్యమైనంత త్వరలో నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. ఘటనలో గాయపడిన వ్యక్తులు కోలుకుంటున్నారని చెప్పారు. 

మరోవైపు ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. నిందితుడి కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. 2022లో నవంబర్ లో కూడా మంగళూరులో ఇదే తరహాలో బాంబు పేలింది.


More Telugu News