లోక్ సభ ఎన్నికల్లో 350కి పైగా సీట్లు గెలుచుకుంటాం: బండి సంజయ్

  • 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి సూచన
  • గత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు బీజేపీని, మోదీని తిట్టేదని ఆరోపణ
  • తెలంగాణకు కేంద్రం సహకరిస్తోందన్న బండి సంజయ్
రానున్న లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 350కి పైగా సీట్లు గెలుచుకుంటామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్ మండలం శాయంపేటలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని హితవు పలికారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ పథకాల్లో కోత పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణవ్యాప్తంగా 50 లక్షల కుటుంబాలకు కోత పెట్టడం సరికాదన్నారు. ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఈ యాత్రకు విరామం ఇవ్వనున్నట్లు తెలిపారు.

అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డపై కాంగ్రెస్ మాట్లాడితే, పాలమూరు-రంగారెడ్డి, కృష్ణా జలాలు అని బీఆర్ఎస్ మాట్లాడుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఇప్పటికే తేలిందని, చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకో చెప్పాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం కలిసి ముందుకు సాగాలన్నారు. గత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు ప్రధాని మోదీని తిట్టడం, బీజేపీని తిట్టడానికే సరిపోయిందని విరుచుకుపడ్డారు. ప్రజలకు మేలు జరిగేలా కేసీఆర్ కుటుంబం ఏనాడూ చూడలేదన్నారు.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తోందని గుర్తు చేశారు. తాను కాంగ్రెస్ నాయకులకు కూడా ఓ విజ్ఞప్తి చేస్తున్నానని... రాజకీయ విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణకు సహకరించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదని, ఇక బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ గతంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.


More Telugu News