175 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసిన కేంద్రం.. తొలగిపోనున్న పలు సమస్యలు

  • ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు భూములు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రేవంత్
  • సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం
  • మోదీ, రాజ్ నాథ్ సింగ్ లకు ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వానికి 175 ఎకరాల భూమిని కేంద్ర రక్షణ శాఖ బదిలీ చేసింది. ఈ భూములకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించిన రక్షణ శాఖ... భూముల బదిలీకి అనుకూలంగా అనుమతులను ఇచ్చింది. 

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కార్యాలయం స్పందిస్తూ... జనవరి 5న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించిన తర్వాత... ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రక్షణ శాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రేవంత్ కోరగా... కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని అన్నారు. తమ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. 

మరోవైపు, ఈ భూములను తెలంగాణకు కేటాయించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సంతోషం వ్యక్తం చేశారు. మోదీకి, రాజ్ నాథ్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల కామారెడ్డి మార్గం (ఎన్ హెచ్ 44), రాష్ట్ర రహదారి నెంబర్ 1లో సొరంగాల నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్లు సులభతరం అవుతాయని చెప్పారు. దేశ ప్రజలకు మోదీ ఇస్తున్న హామీలకు ఇది మరో నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండంలను కలుపుతూ నిర్మించే రాజీవ్ రహదారి కోసం 11.3 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్ కారిడార్ కోసం భూసేకరణ చేయాల్సి ఉందని చెప్పారు. ఇందులో కొంత భూమి రక్షణ శాఖ పరిధిలో ఉందని... కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని అన్నారు.


More Telugu News