చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు

  • నెల్లూరులో రా కదలిరా సభ
  • నెల్లూరు నగరానికి విచ్చేసిన చంద్రబాబు
  • వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి దంపతులకు పసుపు కండువా కప్పిన టీడీపీ చీఫ్
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రా కదలిరా సభ కోసం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రం బాగు కోసం కలిసి పనిచేద్దాం అని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా వేమిరెడ్డి కుటుంబం చంద్రబాబును సత్కరించి వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించింది. కాగా, వేమిరెడ్డి కుటుంబంతో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరిగింది. 

చంద్రబాబు స్పందిస్తూ... రాజకీయాల్లో అజాతశత్రువు వంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు. ప్రజాసేవకు మారు పేరు వేమిరెడ్డి... ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అని తెలిపారు. ఆయన రాకతో నెల్లూరులో సునాయాసంగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయిపోతుందని అన్నారు. పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులకు టీడీపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చంద్రబాబు ఉద్ఘాటించారు. 

టీడీపీలో చేరిన సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... తన పరిధి మేరకు ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు. మరింత మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. టీడీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మీ అందరి మద్దతు నాకు అవసరం అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని స్పష్టం చేశారు.


More Telugu News