వివేకా హత్య కేసులో సీఎం పాత్ర ఉంది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే
  • అందుకే దర్యాఫ్లునకు ఆటంకం కలిగిస్తున్నాడని విమర్శ
  • ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని మండిపాటు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో సీఎం జగన్ పాత్ర ఉందంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా హత్యకు కుట్రలో జగన్ హస్తం ఉందని, అందుకే కేసు దర్యాఫ్తునకు ఆటంకం కలిగిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సొంత చెల్లెలికే న్యాయం చేయని వ్యక్తి ప్రజలకు మాత్రం ఏం చేస్తాడంటూ ప్రశ్నించారు. బాబాయ్ హత్య కేసు విచారణను అడ్డుకుంటున్నాడని జగన్ పై ఆరోపణలు గుప్పించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న అవినీతికి అంతేలేకుండా పోతోందని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, అధికార యంత్రాంగంతో రాజకీయ ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. రాజమండ్రి కేంద్రంగా ఇసుక దందా చేస్తున్నారని, బ్యారేజ్ కింద ఇసుక మొత్తం తవ్వేస్తున్నారని చెప్పారు. ఇసుక మాఫియా ద్వారా రోజుకు రెండు కోట్లు దోచుకుని దాచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల ధన దాహానికి రాజమండ్రి బ్యారేజ్ కు ముప్పు పొంచి ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News