దాదాపు వీడిన ఎమ్మెల్యే లాస్యనందిత మృతి కేసు.. టిప్పర్ డ్రైవర్ తప్పిదం లేనట్టే!

  • నిద్రమత్తులో టిప్పర్‌ను ఢీకొట్టిన లాస్య కారు డ్రైవర్
  • టిప్పర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కారు ఢీకొట్టడంతో పగిలిపోయిన టిప్పర్ సిగ్నల్ లైట్ బోర్డు 
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ప్రమాదం కేసులో మిస్టరీ దాదాపు వీడినట్టే. టిప్పర్ డ్రైవర్ తప్పిదం ఏమీ లేదని, లాస్య కారు డ్రైవర్ ఆకాశ్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. నిద్రమత్తులో ఉన్న ఆకాశ్ ముందు వెళ్తున్న టిప్పర్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఆ తర్వాత కారు అంతే వేగంతో రెయిలింగ్‌‌ను ఢీకొట్టడంతో లాస్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

నిజానికి తొలుత టిప్పరే లాస్య కారును ఢీకొట్టి ఉంటుందని పోలీసులు భావించారు. అందుకనే డ్రైవర్ ఆపకుండా పరారయ్యాడని అనుకున్నారు. కానీ, సీసీటీవీ ఫుటేజీల పరిశీలనలో అసలు విషయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ టిప్పర్‌ (టీఎస్ 08 యూజే 0025)ను గుర్తించారు. కారు ఢీకొట్టడంతో టిప్పర్ వెనక సిగ్నల్ లైట్ బోర్డు పగిలిపోయింది. పైభాగంలోని ఇనుప గార్డు కూడా పక్కకి వంగిపోయింది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని ప్రశ్నిస్తున్నారు. కారు ఢీకొట్టిన విషయం తెలిసి కూడా లేనిపోని తలనొప్పులు ఎందుకున్న ఉద్దేశంతో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్న పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.


More Telugu News