హార్ధిక్ పాండ్యా వద్ద ఇషాన్ కిషన్ ట్రైనింగ్ తీసుకోవడంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి!

  • ఐపీఎల్‌ కోసం శిక్షణ తీసుకోవడంపై సెలక్టర్లు అసహనంగా ఉన్నారన్న ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో  
  • సెంట్రల్ కాంట్రాక్టులకు ఆటగాళ్ల పేర్లు సిఫార్సులు చేసిన సెలక్టర్ల ఆగ్రహానికి గురయ్యాడని వెల్లడి
  • ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ పేర్లను తప్పించిన బీసీసీఐ
దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన, జాతీయ జట్టులోకి ఎంపికకు ప్రామాణికమైన రంజీ ట్రోఫీలో ఆడని కారణంగా యువక్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ ఇటీవలే రద్దు చేసింది. ఏ కేటగిరిలోనూ వారిద్దరి పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. ఇషాన్ కిషన్ విషయంలో బీసీసీఐ సెలక్టర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌ను దృష్టిలో ఉంచుకొని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వద్ద ఇషాన్ శిక్షణ తీసుకోవడంపై సెలక్టర్లు అసహనంగా ఉన్నారని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో తన కథనంలో పేర్కొంది. ఏ ఆటగాళ్లకు ఏయే సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలనే దానిపై బీసీసీఐకి సిఫార్సు చేసిన సెలక్టర్లు అసంతృప్తికి గురయినట్టు తెలిపింది. ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక శ్రేయాస్ అయ్యర్ కూడా ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ ప్రీ-ఐపీఎల్ క్యాంప్‌కు హాజరయ్యాడు. వీరిద్దరిని సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి బీసీసీఐ తొలగించినట్టు వెల్లడించింది

కాగా స్టార్ ప్లేయర్‌లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌‌లకు వార్షిక కాంట్రాక్టుల జాబితాలో చోటుదక్కలేదు. వీరిద్దరి పేర్లను బీసీసీఐ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వీరిద్దరికి వార్షికవేతనం లభించలేదు. ఆర్థిక నష్టమే కాకుండా జాతీయ క్రికెట్ అకాడమీ వంటి బీసీసీఐ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి వీలుండదు. ఆటగాళ్ల సంబంధిత రాష్ట్ర క్రికెట్ బోర్డుల నుంచి అనుమతి పొందితే మాత్రమే సౌకర్యాలను పొందేందుకు వీలుంటుంది. అంతేకాదు బీమాను కూడా కోల్పోతారు. ఎవరైనా ఆటగాడు గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైతే ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసే అవకాశాన్ని అయ్యర్, కిషన్ ఇద్దరూ కోల్పోయారు.


More Telugu News