అబుదాబి తొలి హిందూ దేవాలయంలో సామాన్యులకు దర్శనాలు ప్రారంభం

  • డ్రెస్ కోడ్, ఇతర మార్గదర్శకాలు కూడా విడుదల చేసిన ఆలయ అధికారులు
  • మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా వస్త్రధారణ ఉండాలని రూల్
  • ఆలయంలోకి పెంపుడు జంతువులు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి నిరాకరణ
అబుదాబిలోని బాప్స్ హిందూ దేవాలయంలో సామాన్యులకు దర్శనాలను ప్రారంభించారు. దర్శనాల నియమ నీబంధనలు, భక్తుల డ్రెస్‌ కోడ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. అబుదాబిలో తొలి హిందూ దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన బాప్స్ మందిరాన్ని ప్రధాని మోదీ గత నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే. 

ఆలయ నిబంధనల ప్రకారం, మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఇతర వస్త్ర డిజైన్లకు అనుమతి లేదు. టైట్‌గా ఉన్న దుస్తులు, పాక్షిక పారదర్శకంగా ఉన్న దుస్తులనూ అనుమతించరు. కళ్లుచెదిరేలా తళుకులీనే యాక్సెసరీలు, శబ్దాలు చేసే ఉపకరణాలనూ ఆలయంలోకి అనుమతించరు. 

పెంపుడు జంతువులు, బయటి ఆహారాన్ని కూడా ఆలయంలోకి అనుమతించరు. దేవాలయం పరిసరాల్లో డ్రోన్స్‌ వినియోగంపై కూడా నిషేధం విధించారు. ఆలయంలోని ఆధ్యాత్మిక, ప్రశాంతమైన వాతావరణానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 

అబూ మారేఖ్ ప్రాంతంలోని ఈ ఆలయాన్ని రూ.700 కోట్లతో 27 ఎకరాల్లో నిర్మించారు. బాప్స్ సంస్థ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరిగింది. ఫిబ్రవరి 14న ప్రధాని మోదీ స్వయంగా ఈ ఆలయాన్ని ప్రారంభించారు. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేశారు.


More Telugu News