కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్ లకు లీగల్ నోటీసులు పంపించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

  • తన ఇంటర్వ్యూ వీడియోను వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ ఆగ్రహం
  • రెండు రోజుల్లో లిఖితపూర్వక క్షమాపణలు చెప్పకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
  • ఓ ఇంటర్వ్యూలో గడ్కరీ మాటలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నోటీసులు
ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, కేవలం 19 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి జనాల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత జైరాం రమేశ్‌లకు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు జారీ చేశారు. 

‘‘నా క్లయింట్ (గడ్కరీ) ఇంటర్వ్యూలో ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా సందర్భోచిత అర్థాన్ని దాచిపెట్టి వీడియోను కట్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా క్లయింట్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారు’’ అంటూ గడ్కరీ తరపున న్యాయవాది నోటీసులు పంపించారు. సోషల్ మీడియా పోస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించుకోవాలని, మూడు రోజుల్లో నితిన్ గడ్కరీకి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ నోటీసులకు స్పందించకుంటే సివిల్, క్రిమినల్ వ్యాజ్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.గందరగోళం, సంచలనం సృష్టించేందుకు, గడ్కరీని అపఖ్యాతి పాలుచేయడమే లక్ష్యంగా ఈ వీడియోను షేర్ చేశారని పేర్కొన్నారు. గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో చీలికలు సృష్టించేందుకు ఈ ప్రయత్నం చేశారని నోటీసుల్లో ఆరోపించారు. 

కాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 19 సెకన్ల క్లిప్పింగ్‌ను కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది. గ్రామాలు, పేదలు, కూలీలు, రైతులు సంతృప్తికరంగా లేరంటూ ఆ వీడియోలో గడ్కరీ అన్నారు. గ్రామాలకు మంచి రోడ్లు, తాగడానికి నీరు, మంచి ఆసుపత్రులు, మంచి పాఠశాలలు లేవని గడ్కరీ చెప్పారు. గ్రామీణ-పట్టణ వలసల అంశంపై మాట్లాడుతూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రైతుల జీవనస్థితి గతులను మెరుగుపరచేందుకు ఎన్డీయే ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి గడ్కరీ మాట్లాడినప్పటికీ దానిని వీడియో క్లిప్పింగ్‌లో కట్ చేశారు.


More Telugu News