యాదాద్రి పేరు మారుస్తాం: ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

  • యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామన్న ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
  • ఆలయానికి పూర్వ సంప్రదాయం చేకూర్చేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడి
  • క్షేత్రాభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడి
యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మారుస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శుక్రవారం వెల్లడించారు. ఆలయం వద్ద టెంకాయ కొట్టే స్థలాన్ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. క్షేత్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. త్వరలోనే ఆయన ఆలయ సందర్శనకు వస్తారని తెలిపారు. నెల రోజుల్లోనే సమీక్ష సమావేశం నిర్వహించి క్షేత్రానికి పూర్వ సంప్రదాయం చేకూర్చేలా కృషి చేస్తానన్నారు. తొలుత ఎమ్మెల్యేకు ఆలయ ఈవో రామకృష్ణా రావు, ధర్మకర్త నరసింహమూర్తి స్వాగతం పలికారు. అనంతరం ఆయన దైవ దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. 

వందల సంవత్సరాలుగా  వస్తున్న యాదగిరి గుట్ట పేరును గత ప్రభుత్వం యాదాద్రిగా మార్చిందని ఎమ్మెల్యే అన్నారు. భద్రాచలం పేరును కూడా మార్చిందని చెప్పారు. ఇది సంప్రదాయానికి విరుద్ధమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ పదాలే ముఖ్యమని అన్నారు. 60 ఏళ్లపాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్రా పేర్లు ఉండొద్దని ముఖ్యమంత్రి అన్నారని, ఇది విని తన జన్మ నిజంగా ధన్యమైనట్టు అనిపించిందని వ్యాఖ్యానించారు. అతి త్వరలో యాదాద్రికి యాదగిరి గుట్టగా సీఎం నామకరణం చేస్తారని అన్నారు. పాత సంప్రదాయాలు పునరుద్ధరిస్తామని అన్నారు. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 

కొండపై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. పది రోజుల్లో హాల్ నిర్మాణం చేయాలని సూచించారు. ఆలయ పూజారుల కోసం విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.


More Telugu News