బెంగళూరు బాంబు పేలుడు.. కేసు దర్యాప్తులో కీలక పరిణామం

  • సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించినట్టు తెలిపిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
  • నిందితుడి వయసు 28-30 ఏళ్ల మధ్య ఉంటుందని వెల్లడి
  • ఘటనా స్థలంలో ఇతర బాంబులేవీ లభించలేదన్న పోలీసులు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు సంబంధించి పోలీసులు తాజాగా నిందితుడిని గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం కేఫ్‌లో పెట్టిన బాంబు పేలడంతో 10 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే. ఐఈడీ కారణంగా ఈ పేలుడు సంభవించిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాకు తెలిపారు. బాంబు ఉన్న బ్యాగ్‌ను నిందితుడు కేఫ్‌లో వదిలివెళ్లినట్టు చెప్పారు. 

కాగా, సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితుడిని గుర్తించినట్టు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. అతడి వయసు 28- 30 ఏళ్లు ఉండొచ్చని అన్నారు. రవ్వ ఇడ్లీ కోసం కౌంటర్‌లో కూపన్ తీసుకున్న నిందితుడు అది తినకుండానే తన బ్యాగ్‌ను అక్కడ వదిలేసి వెల్లిపోయాడని చెప్పారు. ఇక ఘటనా స్థలంలో మరే ఇతర బాంబులు లభించలేదని పోలీసులు తెలిపారు. నిందితుడికి టోకెన్ జారీ చేసిన క్యాషియర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్యేనా? కాదా? అన్న విషయం ఇప్పుడే చెప్పలేమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. ఇదేమీ భారీ పేలుడు కాదని అన్నారు. ఘటనలో కేఫ్ సిబ్బందితో పాటు ఓ కస్టమర్ గాయపడ్డాడని తెలిపారు. అయితే, వారి ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదని వెల్లడించారు. కాగా, ఘటనపై హెఏఎల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


More Telugu News