అమెరికాలో మిత్రుడి హత్య.. కేంద్ర ప్రభుత్వ సాయం అర్థించిన ప్రముఖ టీవీ నటి

  • అమెరికాలో మంగళవారం మరో భారతీయుడి హత్య 
  • సెయింట్ లూయీ అకాడమీ ప్రాంతంలో వాకింగ్ చేస్తుండగా కాల్పుల్లో మృతి
  • ఘటనపై ప్రధాని, విదేశాంగ మంత్రిని ఆశ్రయించిన మృతుడి స్నేహితురాలు, టీవీ నటి దేవోలీనా 
  • మృతదేహం స్వాధీనంలో సాయపడాలంటూ అర్థింపు
అమెరికాలో భారతీయులపై వరుస దాడుల కలకలం కొనసాగుతోంది. మంగళవారం జరిగిన కాల్పుల్లో మరో భారతీయుడు అమర్‌నాథ్‌ ఘోష్ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి స్నేహితురాలు, ప్రముఖ టీవీ నటి దేవొలీనా భట్టాచార్జీ కేంద్ర ప్రభుత్వం సాయం కోరింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

సెయింట్ లూయీ అకాడమీ ప్రాంతంలో సాయంత్రం వేళ వాకింగ్ చేస్తున్న తన స్నేహితుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని దేవోలీనా తెలిపింది. ‘‘అతడిది కోల్‌కతా. తన తల్లిదండ్రులకు అతడు ఒక్కడే సంతానం. తల్లి మూడేళ్ల క్రితం మరణించింది. తండ్రి చిన్నతనంలోనే పోయారు. ఈ కేసులో నిందితుల వివరాలు ఇప్పటివరకూ వెల్లడించలేదు. అమర్‌నాథ్ ఘోష్ కోసం న్యాయపోరాటం చేసేందుకు అతడి మిత్రులు తప్ప కుటుంబసభ్యులు ఎవరూ లేరు. అతడు గొప్ప డ్యాన్సర్, పీహెచ్‌డీ చేస్తున్నాడు. అతడి మృతదేహం తీసుకునేందుకు కొందరు ఫ్రెండ్స్ ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పటివరకూ ఈ విషయమై ఎటువంటి సమాచారం లేదు.  ఈ విషయంలో దయచేసి సాయం చేయండి. కనీసం అతడి హత్యకు గల కారణాలు అయినా తెలియాలి’’ అని ఆమె ట్విట్టర్ వేదికగా అర్థించారు. 

కాగా, ఘటనపై షికాగాలోని భారత దౌత్య కార్యాలయం స్పందించింది. అమర్‌నాథ్‌ స్నేహితులు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. కేసు పురోగతిని పరిశీలిస్తున్నామని, అవసరమైన సాయం చేస్తున్నామని ట్వీట్ చేసింది.


More Telugu News