ఎన్నికల ముంగిట రాజకీయ పార్టీలను హెచ్చరించిన ఈసీ

  • ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం
  • మతం, భాష, కులం ఆధారంగా ఓట్లు అడగొద్దన్న ఎన్నికల సంఘం
  • సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు
  • సమస్యలే అజెండాగా ప్రచారం చేసుకోవాలని సూచన
ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను హెచ్చరించింది. వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పార్టీలు వ్యవహరించరాదని... మతం, భాష, సామాజికవర్గం ప్రాతిపదికన ఓట్లు అడిగే ప్రయత్నం చేయవద్దని పార్టీలకు స్పష్టం చేసింది. ప్రచారం కోసం ప్రార్థనా మందిరాలను వాడుకోవద్దని పేర్కొంది. 

ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్లను మోసగించేలా తప్పుడు ప్రకటనలు చేయరాదని ఈసీ వెల్లడించింది. అవాస్తవ ప్రకటనల జోలికి వెళ్లొద్దని, ముఖ్యంగా, సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికింది. రాజకీయ ప్రత్యర్థులను దూషించే పోస్టులు, వారిని అవమానించే పోస్టులు పెట్టరాదని స్పష్టం చేసింది. 

ఇక, గతంలో నోటీసులు అందుకున్న ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. 

ఎన్నికల ప్రచారంలో విభజనవాదం, వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలని... సమస్యలే అజెండాగా ఎన్నికల్లో ప్రచారం సాగించాలని, సుహృద్భావ వాతావరణంలో రాజకీయ చర్చలను ప్రోత్సహించాలని వివరించింది. ఎన్నికల కోడ్ ను అతిక్రమిస్తే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.


More Telugu News