టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
- ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతిపై సవాల్
- సూర్యనారాయణరెడ్డి ఇంటికి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
- కొవ్వూరు పోలీస్ స్టేషన్ కు తరలింపు
టీడీపీ నేత, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కొవ్వూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే, అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతి, అక్రమాలపై ఆయన నివాసానికే వెళ్లి చర్చిస్తానని... 109 అంశాలపై చర్చకు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. ఈ ఉదయం రామవరం నుంచి అనపర్తిలోని ఎమ్మెల్యే ఇంటికి ఆయన బయల్దేరారు. అయితే, రామవరంలోనే ఆయనను పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా పోలీసులు - టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత మధ్యే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.