పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం.. వాచ్‌మన్‌గా చేస్తూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తెలంగాణ యువకుడు

  • ఎంకామ్, బీఈడీ, ఎంఈడీ పూర్తిచేసిన ప్రవీణ్
  • ఉస్మానియాలోని ఈఎంఆర్‌సీలో ఐదేళ్లుగా నైట్ వాచ్‌మన్‌గా విధులు
  • టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల సాధన
కాస్తంత పట్టుదల, కొంచెం శ్రమను పెట్టుబడిగా పెడితే సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపించాడు తెలంగాణ కుర్రాడు. నైట్ వాచ్‌మన్‌గా ఉద్యోగం చేస్తూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ఆ కుర్రాడి పేరు ప్రవీణ్. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ జిన్నారంలో డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత  హైదరాబాద్‌లోని ఉస్మానియాలో ఎంకామ్, బీఈడీ, ఎంఈడీ పూర్తి చేశాడు. 

ఆపై ఉద్యోగ ప్రయత్నాల్లో పడిన ప్రవీణ్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్‌సీ)లో రాత్రిపూట వాచ్‌మన్‌గా చేరాడు. ఐదేళ్లుగా వాచ్‌మన్‌గా ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తెలంగాణ గురుకుల విద్యాలయాల పోస్టులకు నిర్వహించిన పరీక్షలు రాశాడు. ఇటీవల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించాడు. ఓ వైపు నైట్ వాచ్‌మన్‌గా పనిచేస్తూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ప్రవీణ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.


More Telugu News