ప్రత్తిపాటి శరత్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధింపు

  • గురువారం రాత్రి ఆదేశాలు ఇచ్చిన క్రీస్తు రాజపురం ఒకటవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్  
  • వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు హాజరుపరిచిన పోలీసులు
  • ఈ కేసులో 409 సెక్షన్ చెల్లదని చెప్పిన జడ్జి.. 469 సెక్షన్ కింద రిమాండ్ విధింపు
టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గురువారం రాత్రి శరత్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం క్రీస్తు రాజపురంలోని ఒకటవ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి కరీముల్లా నివాసానికి వెళ్లి ఆయన ముందు శరత్‌ను పోలీసులు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 469 సెక్షన్‌ కింద శరత్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఇక కేసులో సెక్షన్ 409 చెల్లదని స్పష్టం చేశారు. రిమాండ్ విధించడంతో శరత్‌ను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. కాగా జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై శరత్‌ను గురువారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు శరత్‌పై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాటి శరత్ సహా ఏడుగురిపై కేసు నమోదయింది. అందులో ఆయన భార్య, బావమరిది కూడా ఉన్నట్టు సమాచారం. నిధులు మళ్లించి పన్ను ఎగవేశారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. శరత్‌పై ఐపీసీ 420, 409, 467, 471, 477(ఏ), 120బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా అవెక్సా కంపెనీలో అదనపు డైరెక్టర్‌గా శరత్ కేవలం 3 నెలలే పనిచేశారని టీడీపీ నేత పట్టాభిరామ్ గురువారం మీడియా సమావేశంలో అన్నారు. ముమ్మాటికీ రాజకీయ కక్షతో జగన్ పెట్టిన కేసు అని ఆయన ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.


More Telugu News