ఆత్మహత్యకు యత్నించిన రైతును భుజాన వేసుకుని రెండు కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి తీసుకెళ్లిన కానిస్టేబుల్

  • కరీంనగర్ జిల్లా వీణవంక మండలం భేతిగల్‌లో ఘటన
  • ఇంట్లో గొడవ పడి పొలానికి వెళ్లి పురుగుల మందు తాగిన రైతు సురేశ్
  • రైతు ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ జయపాల్‌పై ప్రశంసలు
పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన రైతును ఓ కానిస్టేబుల్ తన భుజాలపై మోసుకుని రెండు కిలోమీటర్లు మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడాడు. కరీంనగర్ జిల్లాలో జరిగిందీ ఘటన. రైతు ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. 

ఇంతకీ ఏం జరిగిందంటే..  జిల్లాలోని వీణవంక మండలం భేతిగల్‌కు చెందిన రైతు సురేశ్ నిన్న ఇంట్లో గొడవపడి కోపంతో పొలానికి వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డు కిన్నెర సంపత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అప్పటికే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన సురేశ్‌ను జయపాల్ భుజాన వేసుకుని పొలం గట్లపై దాదాపు రెండు కిలోమీటర్లు నడిచి గ్రామంలోకి తీసుకొచ్చాడు. అనంతరం బాధిత రైతు కుటుంబ సభ్యులతో కలిసి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రైతును భుజాలపై మోస్తూ, సకాలంలో ఆసుపత్రికి తీసుకొచ్చిన కానిస్టేబుల్ జయపాల్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.


More Telugu News