సందేశ్‌ఖాలీ కేసు: హైకోర్టు ఆదేశాలతో కదిలిన పోలీసులు.. 55 రోజుల తర్వాత టీఎంసీ నేత షాజహాన్ అరెస్ట్

  • లైంగిక వేధింపులు, భూకబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజహాన్
  • షాజహాన్‌పై చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
  • అరెస్ట్ చేయాల్సిందేనని న్యాయస్థానం ఆదేశాలు 
  • తమ పోరాట ఫలితమేనన్న బీజేపీ
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో పలువురు మహిళలపై లైంగికహింస, భూకబ్జాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ 55 రోజులుగా పరారీలో ఉన్న అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు షేక్ షాజహాన్‌ను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మినాఖాన్ ప్రాంతంలో షాజహాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 

షాజహాన్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అతడిని అరెస్ట్ చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
 
షాజహాన్ షేక్, ఆయన అనుచరులు తమపై లైంగికదాడికి పాల్పడడంతోపాటు భూములు లాక్కుంటున్నారంటూ సందేశ్‌ఖాలీలోని పలువురు మహిళలు ఆరోపించారు. షాజహాన్‌, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. షాజహాన్ అరెస్ట్‌పై బీజేపీ పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ ఆందోళనతో దిగివచ్చి షాజహాన్‌ను అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు. అయితే, కోర్టు స్టే ఆదేశాల కారణంగానే షాజహాన్ అరెస్ట్ ఆలస్యమైందని టీఎంసీ ఎంపీ శంతనుసేన్ తెలిపారు. తమ ప్రభుత్వం పాటిస్తున్న రాజధర్మం, పాలనా పద్ధతికి ఈ అరెస్ట్ నిదర్శనమని పేర్కొన్నారు. తమ నుంచి బీజేపీ రాజధర్మం గురించి తెలుసుకోవాలని కోరారు.
 
షాజహాన్, ఆయన అనుచరుల భూకబ్జాలపై గిరిజనుల నంచి షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్‌కు 50 ఫిర్యాదులు అందాయి. అలాగే, భూములకు సంబంధించి 400 సహా మొత్తం 1,250 ఫిర్యాదులు అందినట్టు ప్రభుత్వాధికారులు తెలిపారు. కాగా, ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 4కు హైకోర్టు వాయిదా వేసింది.


More Telugu News