ఇంజెక్షన్ కోసం నరం దొరక్క వృద్ధ ఖైదీకి మరణ శిక్ష నిలిపివేత!

  • ఐడాహో రాష్ట్రంలో బుధవారం ఘటన
  • నిందితుడికి ప్రాణాంతక ఇంజెక్షన్‌తో శిక్ష అమలు ప్రయత్నం చివరి నిమిషంలో విఫలం
  • తదుపరి ఏం చేయాలో ఇంకా ఆలోచించలేదన్న రాష్ట్ర జైళ్ల శాఖ
  • ఇలాంటి పలు ఘటనలు గతంలోనూ వెలుగులోకొచ్చిన వైనం

అమెరికాలో 40 ఏళ్ల నాటి ఓ హత్య కేసులో దోషికి మరణ శిక్ష అమలును చివరి నిమిషంలో నిలిపివేయాల్సి వచ్చింది. నిందితుడు థామస్ క్రీష్‌కు (73) నరాల ద్వారా ప్రాణాంతక ఇంజెక్షన్‌ను ఇచ్చి శిక్ష అమలు చేయాల్సి ఉండగా వైద్య బృందానికి అతడి ఒంట్లో నరం దొరక్కపోవడంతో శిక్షను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఐడాహో రాష్ట్రంలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. 

ఇంజెక్షన్ కోసం నరం కోసం వైద్య బృందం సుమారు 8 సార్లు ప్రయత్నించిందని అక్కడి జైళ్ల శాఖ అధికారి ఒకరు తెలిపారు. చేతులే కాకుండా, కాళ్లల్లో కూడా ఇంజెక్షన్‌కు అనువుగా ఐవీ లైన్ లభించలేదన్నారు. తదుపరి ఏం చేయాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పారు. 

థామస్‌కు 1981లోనే మరణ శిక్ష పడింది. తన తోటి ఖైదీని చంపినందుకు శిక్ష పడింది. అప్పటికే అతడిపై మరో ఐదు హత్య కేసులు ఉన్నాయి. అయితే, తాను కనీసం డజను మందిని చంపానని అతడు అప్పట్లో తెలిపాడు. 

అమెరికాలో ఇటీవల ఇలాంటి అనేక ఘటనలు వెలుగు చూశాయి. అక్కడి ఖైదీలకు సాధారణంగా ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ఇచ్చి మరణ శిక్ష విధిస్తారు. అయితే, ఇంజెక్షన్‌కు అనువైన నరాలు దొరక్క చాలా సందర్భాల్లో మరణ శిక్ష నిలిపివేయాల్సి వచ్చింది. ఇటీవలే అమెరికాలో నైట్రోజన్ వాయువు వినియోగించి ఓ ఖైదీకి మరణ శిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే.


More Telugu News