హైదరాబాద్ అవుటర్ టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

  • టెండర్ల ఖరారుపై పూర్తి వివరాలు సేకరించే బాధ్యతను హెచ్ఏండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అప్పగింత
  • పూర్తి నివేదిక అందాక మంత్రివర్గంలో చర్చించనున్నట్టు వెల్లడించిన సీఎం
  • అనంతరం, దర్యాప్తు బాధ్యతను సీబీఐ లేదా తత్సమాన సంస్థకు అప్పగింత
  • ఫైళ్లు మాయమైనట్టు గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్ అవుటర్ రింగ్‌ రోడ్డు టోల్ ట్యాక్స్ వసూలు టెండర్లలో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ మొత్తానికి టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఎండీఏపై బుధవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించారు. ఇందులో ఎవరెవరి ప్రమేయముంది? ఏయే సంస్థలున్నాయి? బాధ్యులెవరు? అన్న కోణాల్లో దర్యాప్తు చేయాలన్నారు. 

‘‘టెండర్లలో జరిగిన అవకతవకలు, టెండర్ల విధివిధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలు అందజేయాల్సిన బాధ్యతను హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అప్పగిస్తున్నాం. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా అదే స్థాయికి చెందిన మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తాం’’ అని సీఎం అన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు మాయమైనట్టు గుర్తిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.


More Telugu News