బీజేపీకి పాకిస్థాన్ శత్రుదేశం కావొచ్చు... మాకు పొరుగుదేశం: కర్ణాటక కాంగ్రెస్ నేత వ్యాఖ్య

  • శాసన మండలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక కాంగ్రెస్ నేత హరిప్రసాద్
  • జిన్నాను పొగిడిన అద్వానీకి భారతరత్న ఇచ్చినప్పుడు పాకిస్థాన్ శత్రుదేశం కాదా? అని ఎద్దేవా
  • కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
కర్ణాటక కాంగ్రెస్ నేత బీ.కే. హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీకి పాకిస్థాన్ శత్రుదేశం కావచ్చేమో కానీ, తమ పార్టీకి మాత్రం పొరుగుదేశమని వ్యాఖ్యానించారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించిన తర్వాత ఓ వ్యక్తి పాక్ అనుకూల నినాదాలు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అంశం వివాదాస్పదంగా మారింది. తాజాగా బీ.కే.హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.

హరిప్రసాద్ శాసన మండలిలో మాట్లాడుతూ.... వారు శత్రు దేశంతో మనకున్న సంబంధాల గురించి మాట్లాడుతున్నారని, వారి ప్రకారం, పాకిస్తాన్ శత్రుదేశమని, కానీ మనకు శత్రువు కాదు... మన పొరుగు దేశమని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ మన శత్రుదేశమని బీజేపీ చెబుతోందని... కానీ లాహోర్‌లోని జిన్నా సమాధిని సందర్శించి, ఆయన వంటి సెక్యులర్ నాయకుడు మరొకరు లేరని చెప్పిన అద్వానీకి ఇటీవ‌ల వారు భారతరత్న ప్రదానం చేశారని గుర్తు చేశారు. అప్పుడు పాకిస్తాన్ శత్రు దేశం కాదా? అని హ‌రిప్ర‌సాద్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నేత వ్యాఖ్య‌ల‌పై బీజేపీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. మన దేశంతో నాలుగుసార్లు యుద్ధం చేసినా పాకిస్థాన్‌ను కాంగ్రెస్ శత్రుదేశంగా చెప్పడం లేదని, ఇది ఆ పార్టీ దేశ వ్యతిరేక భావనలకు నిదర్శనమని కర్ణాటక బీజేపీ ఆరోపించింది. పాకిస్థాన్ పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటో బీ.కే. హరిప్రసాద్ సభలో స్పష్టం చేశారన్నారు. జవహర్ లాల్ నెహ్రూ-మహ్మద్ అలీ జిన్నా మధ్య ఉన్న సాన్నిహిత్యం నేటికీ కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ నేత స్పష్టం చేశారని పేర్కొన్నారు.

విధానసభలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారికి అండగా నిలవడమే కాకుండా.. భారత్ పై నాలుగుసార్లు యుద్ధం ప్రకటించిన పాకిస్థాన్ శత్రు దేశం కాదన్న కాంగ్రెస్ వాళ్ల మైండ్ సెట్ గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదని, హరిప్రసాద్ వంటి దేశ వ్యతిరేక భావాలు కలిగిన వారు కాంగ్రెస్‌లో అన్నిస్థాయుల్లో ఉన్నారని బీజేపీ ట్వీట్ చేసింది.


More Telugu News