ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం... నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం: బాలకృష్ణ

  • తాడేపల్లిగూడెం సభలో బాలయ్య స్పీచ్
  • ఎన్టీఆర్ విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారని వెల్లడి
  • చంద్రబాబు కూడా ఎన్టీఆర్ బాటలో పార్టీని ముందుకు తీసుకెళుతున్నారని కితాబు
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెం సభలో ప్రసంగించారు. వేదికపై ఉన్న అందరికీ ఆయన అభివాదం తెలిపారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనగానే సభలో ఉన్న జనసైనికులు కేరింతలు కొట్టారు. 

అనంతరం బాలకృష్ణ తన ప్రసంగం కొనసాగిస్తూ... తెలుగుదేశం పార్టీ  వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలను అధికారం పీఠంపై ఎక్కించారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ చూపిన బాటలోనే పార్టీని ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. టీడీపీకి ఉన్న బలం కార్యకర్తలేనని బాలయ్య పునరుద్ఘాటించారు. 

వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ముఖ్యంగా, రాష్ట్రంలో రైతు ఉనికే లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం... నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటూ శ్రీ శ్రీ కవితను ఉదహరించారు. ఏపీలో పాలన కూడా ఇదే తరహాలో ఉందని విమర్శించారు. 

టీడీపీ ప్రభుత్వం చేసిన పనులను మెచ్చుకోకుండా, తాము కూడా ఏమీ చేయకుండా, కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకే బ్యాచ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని బాలయ్య తనదైన శైలిలో ధ్వజమెత్తారు. 

"మేం చేసింది ఏమిటో చూపిస్తాం రండి... మీరేం చేశారో చెప్పమని సూటిగా ప్రశ్నిస్తున్నా. చర్చిద్దాం రమ్మంటే రారు... అధికారం ఉంది కదా అని మాట్లాడితే ఎలా. బ్రిటీష్ పాలన తరహాలో కులాలు, మతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు" అంటూ విమర్శించారు. 

ఇవాళ తాడేపల్లిగూడెం సభకు హాజరైన జన సందోహాన్ని చూస్తుంటే టీడీపీ-జనసేన కూటమి విజయం తథ్యం అని చెప్పవచ్చని అన్నారు. ఓటు అనే ఆయుధాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


More Telugu News