త్వరలో ఛలో కొడంగల్ చేపట్టి రేవంత్ రెడ్డి మోసాలను ప్రజలకు వివరిస్తా: బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి

  • ఎవరెవరు ఎంత దోచుకుంటున్నారో చెబుతానని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి నిధులన్నింటినీ కొడంగల్‌కే మళ్లిస్తున్నారని ఆరోపణ
  • కొడంగల్‌కు ఎన్ని స్కూల్స్, ఇళ్లు వెళితే ఆర్మూర్ కు అన్నీ రావాలని డిమాండ్
త్వరలో ఛలో కొడంగల్ కార్యక్రమం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసాలను ప్రజలకు వివరిస్తానని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఎంత దోచుకుంటున్నారో చెబుతానన్నారు. బుధవారం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర జరిగింది. ఆర్మూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నిధులన్నింటినీ కొడంగల్‌కే మళ్లిస్తున్నారని ఆరోపించారు.

మిస్టర్ రేవంత్ రెడ్డీ... నీ కొడంగల్‌కు ఎన్ని స్కూల్స్ వస్తే నా ఆర్మూర్‌కు అన్నీ రావాలి... నీ కొడంగల్‌కు ఎన్ని ఇళ్లు వస్తే నా ఆర్మూర్‌కు అన్నీ రావాలి' అంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగే దాదాపు ప్రతి అభివృద్ధి నరేంద్ర మోదీ పథకాల ద్వారా జరుగుతున్నదే అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి బీజేపీకి 50వేల మెజార్టీ తీసుకు రావాలన్నారు. ఆర్మూర్ బీజేపీ అడ్డా అని నిరూపించాలన్నారు.

ఆర్మూర్ కోసం నీ బిడ్డనైన నేను ఎలా పోరాడుతానో చూడాలన్నారు. ఛలో కొడంగల్ నిర్వహించి పదివేల ఇళ్లు తీసుకు వస్తానన్నారు. కమలమే ఈ దేశానికి, ఈ ధర్మానికి రక్ష అన్నారు. కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఇక్కడి నుంచి ధర్మపురి అరవింద్‌ను మరోసారి గెలిపించుకొని కేంద్రమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు.


More Telugu News