మేమిచ్చిన గ్యారెంటీలను నమ్మే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు: పథకాల ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి

  • సచివాలయంలో గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
  • పేదల ఇళ్లలో వెలుగులు నింపాలని ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడి
  • ఇచ్చిన గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి
  • అర్హత ఉంటే దరఖాస్తుకు అవకాశం ఉంటుందన్న రేవంత్ రెడ్డి
తాము ఇచ్చిన హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు తమకు ఓటు వేసి అధికారం ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీలలో భాగంగా మరో రెండు... మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుతున్నామన్నారు. పేదవారి ఇళ్లలో వెలుగులు నింపాలని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో రెండు హామీలను నెరవేర్చామని... ఇప్పుడు మరో రెండు హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే వెనుకడుగు వేయదన్నారు. తాము ఆర్థిక నియంత్రణ పాటిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీని ఎప్పుడూ విస్మరించలేదన్నారు. అర్హులైన వారందరికీ ఉచిత కరెంట్ ఇస్తామన్నారు.

అర్హత ఉంటే దరఖాస్తుకు అవకాశం

అర్హత ఉండి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోకుంటే మళ్లీ అవకాశం ఉంటుందన్నారు. మండల కార్యాలయానికి వెళ్లి ప్రజాపాలన అధికారికి ఎప్పుడైనా దరఖాస్తును అందించవచ్చునని చెప్పారు. యూపీఏ హయాంలో దీపం పథకం అమలు చేశామని అప్పుడు రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇచ్చామని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.1200కు పెంచిందని ఆరోపించారు.


More Telugu News