తనపై అనర్హత వేటు వేయడంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందన

  • అనర్హత వేటు వేయడం వల్ల తమకు నష్టమేమీ లేదన్న కోటంరెడ్డి
  • మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ ప్రభుత్వం సాధించిందేమీ లేదని ఎద్దేవా
  • ఏడాది క్రితమే తమను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారని వ్యాఖ్య
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అనర్హత వేటు పడిన వారిలో వైసీపీ నుంచి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి... టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్ ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వీరిపై స్పీకర్ వేటు వేశారు. 

మరోవైపు, అనర్హత వేటుపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనర్హత వేటు వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని ఆయన అన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఏడాది క్రితమే పార్టీ నుంచి వైసీపీ తమను సస్పెండ్ చేసిందని చెప్పారు. పార్టీ నుంచి తొలగించిన తర్వాత తమపై అనర్హత వేటు వేసే నైతిక హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని అన్నారు. జగన్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే... నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్న వెంటనే వారిపై వేటు వేసేదని చెప్పారు. తమ నియోజకవర్గాల సమస్యలపై పోరాడితే సస్పెండ్ చేశారని మండిపడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు సరికాదని అన్నారు.


More Telugu News