ఐరాస మానవ హక్కుల మండలిలో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక ప్రసంగం

  • గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా మానవతా సంక్షోభం ఉత్పన్నమవుతోందని ఆందోళన
  • రెండు దేశాలు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్న సూచన
  • ఉగ్రవాదం, అమాయకులను బందీలుగా మార్చుకోవడాన్ని సహించేది లేదన్న జైశంకర్
  • ఐరాస మానవ హక్కుల 55వ సెషన్‌లో వీడియో లింక్ ద్వారా మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సెషన్‌లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం కీలక ప్రసంగం చేశారు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మానవతా సంక్షోభ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నందున పరిష్కారంపై ఇరుదేశాలు దృష్టి పెట్టాలని సూచించారు. ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రదాడిని భారత్ ఖండిస్తోందని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, అమాయకులను బందీలుగా చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం ఇతర దేశాలకు వ్యాపించకూడదని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఐరాస మానవ హక్కుల మండలి 55వ సెషన్‌లో ఆయన ప్రసంగించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని సభ్యదేశాలను జైశంకర్ కోరారు.

మానవ హక్కుల సంస్థాగత హామీలకు భారత్ కట్టుబడి ఉంటుందని జైశంకర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో భారత్ సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ సవాళ్లకు సమర్థవంతమైన ప్రతిస్పందన కోసం బహుళ పాక్షిక విధానాలను సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా జైశంకర్ అన్నారు.


More Telugu News