తెలంగాణలో మహాలక్ష్మి, గృహలక్ష్మీ పథకాలు నేడే ప్రారంభం

  • రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో ప్రారంభోత్సవం
  • రెండు గ్యారెంటీలను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
  • కార్యక్రమంలో పాల్గొననున్న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
  • లోక్‌సభ ఎన్నికల కోడ్ లోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ఫథకం
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండింటిని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నేటి సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు తదితరులు హాజరు కానున్నారు. ఈ సభలో సీఎం.. గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డులు ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద రూ.500లకు గ్యాస్ సిలిండర్ హమీలను ప్రారంభిస్తారు. 

ఈ కార్యక్రమానికి తొలుత కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని పార్టీ నేతలు ప్రకటించారు. అయితే, అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ రాలేకపోతున్నట్టు సమాచారం. కుదిరితే వర్చువల్ విధానంలో ఆమె హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఆరు గ్యారెంటీల అమలు ప్రతిష్ఠాత్మకం కావడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కూడా ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.


More Telugu News