బెంగళూరు మెట్రోలో రైతుకు అవమానం.. సెక్యూరిటీ ఆఫీసర్‌పై వేటు

  • బెంగళూరు మెట్రో రాజాజీనగర్ స్టేషన్‌లో ఘటన
  • మాసిన దుస్తుల్లో నెత్తి మీద దుస్తుల మూటతో స్టేషన్‌కు వచ్చిన రైతు
  • అతడి దుస్తులు బాగోలేవంటూ స్టేషన్‌లోకి అనుమతించని సెక్యూరిటీ అధికారి
  • మరో ప్రయాణికుడి జోక్యంతో రైతును అనుమతించిన వైనం
  • సోషల్ మీడియాలో ఘటన వైరల్, సెక్యూరిటీ అధికారిపై వేటు
మాసిన దుస్తుల్లో ఉన్న ఓ రైతును మెట్రో రైలు ఎక్కేందుకు అనుమతించని ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌పై వేటు పడింది. బెంగళూరులో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. మీడియా కథనాల ప్రకారం, ఓ రైతు నెత్తిన దుస్తుల మూట పెట్టుకుని రాజాజీ మెట్రో స్టేషన్‌కు వచ్చాడు. అతడి వద్ద మెట్రో టిక్కెట్ కూడా ఉంది. కానీ, సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద అతడిని సిబ్బంది ఆపేశారు. ఇలాంటి మాసిన దుస్తులు ధరించి మెట్రోలో వెళ్లడానికి అనుమతి లేదంటూ ఓ సెక్యూరిటీ ఆఫీసర్ అతడికి తేల్చి చెప్పారు. అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు రైతుకు మద్దతుగా నిలిచాడు. సెక్యూరిటీ సిబ్బంది చర్య అసంబద్ధమని వాదించాడు. రైతుతో ఎటువంటి భద్రతాపరమైన సమస్య లేదని, మెట్రో నిబంధనల ప్రకారం అతడి దుస్తుల మూటకు రైల్లో అనుమతి ఉందని కూడా పేర్కొన్నాడు. దీంతో, సెక్యూరిటీ సిబ్బంది రైతును మెట్రోలోకి అనుమతించారు. 

మరోవైపు, ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ కావడంతో కలకలం రేగింది. రైతును అడ్డుకున్న సెక్యూరిటీ ఆఫీసర్‌పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దీంతో ఘటనపై స్పందించిన మెట్రో అధికారులు సదరు సెక్యూరిటీ ఆఫీసర్‌పై వేటు వేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన అధికారులు, మెట్రోలో ఎటువంటి వివక్షకూ తావులేదని పేర్కొన్నారు.


More Telugu News