స్టార్ పేసర్ మహ్మద్ షమీ మడమకు విజయవంతంగా ఆపరేషన్.. ఫొటోలు షేర్ చేసిన క్రికెటర్

  • ఆపరేషన్ విజయవంతమైందని స్వయంగా ప్రకటించిన షమీ
  • వన్డే వరల్డ్ కప్2023 సమయంలో గాయానికి గురైన స్టార్ బౌలర్
  • అనివార్యమవడంతో లండన్‌లో ఆపరేషన్ చేయించుకున్న క్రికెటర్
గతేడాది వన్డే వరల్డ్ కప్-2023లో చీలమండ గాయానికి గురై కొంతకాలంగా క్రికెట్‌కు దూరమైన స్టార్ పేసర్ మహ్మద్ షమీకి మడమ ఆపరేషన్ పూర్తయ్యింది. ‘‘మడమ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. కోలుకోవడానికి కొంతకాలం పడుతుంది. నా కాళ్లపై నేను నడిచి రావడానికి ఎదురుచూస్తుంటాను’’ అంటూ ఎక్స్ వేదికగా షమీ అప్‌డేట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. కాగా సోమవారం సాయంత్రం లండన్‌లో ఈ ఆపరేషన్ జరిగింది.

కాగా 2023 వన్డే ప్రపంచ కప్‌లో షమీ గాయపడ్డాడు. నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత షమీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. చీలమండ గాయానికి ప్రత్యేకమైన ఇంజెక్షన్లు తీసుకున్నప్పటికీ అవి సరిగా పనిచేయకపోవడంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఇటీవలే బీసీసీఐ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.


More Telugu News