బీఆర్ఎస్‌పై అసంతృప్తితోనే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు: తీగల అనితా రెడ్డి

  • జిల్లా కోసం, మహేశ్వరం నియోజకవర్గ పేదల కోసం పని చేస్తామన్న అనితా రెడ్డి
  • ప్రజా సమస్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ
  • అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడి
బీఆర్ఎస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. తన మామయ్య తీగల కృష్ణారెడ్డితో పాటు ఆమె సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తమకు మంచి గౌరవం దక్కిందని... తమ జిల్లా, మహేశ్వరం నియోజకవర్గ పేదల కోసం తాము పని చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.

జిల్లా, నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. గత అయిదేళ్ల కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు పవర్‌ను లేకుండా చేశారని ఆరోపించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు, జెడ్పీ చైర్మన్‌లకు పదవులు నామమాత్రంగానే మారాయన్నారు. తమ హక్కులు, నిధులు లేకుండా చేశారన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారని... అందుకే తాము కాంగ్రెస్ జెండా కప్పుకున్నట్లు తెలిపారు.


More Telugu News