చంద్రబాబు మాకు భగవంతుడు... సీటు ఇవ్వలేదని ఆయనను వ్యతిరేకించడం జరగదు: బుద్ధా వెంకన్న

  • ఇటీవల తొలి జాబితా ప్రకటించిన టీడీపీ
  • కనిపించని బుద్ధా వెంకన్న పేరు
  • చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్న బుద్ధా వెంకన్న
టీడీపీ ఇప్పటికే 94 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించడం తెలిసిందే. అయితే ఇందులో పలువురు సీనియర్లు కోరుకుంటున్న నియోజకవర్గాలు లేవు. అందులో విజయవాడ పశ్చిమం కూడా ఒకటి. ఈ స్థానాన్ని బుద్ధా వెంకన్న ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఈ క్రమంలో ఆయన విజయవాడలో ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది. ఈ ఆత్మీయ సమావేశం ద్వారా పార్టీ అధిష్ఠానానికి ఏం చెప్పదలచుకున్నారు? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. 

అందుకు బుద్ధా స్పందిస్తూ... "ఈ సమావేశం ద్వారా చెప్పేది ఒక్కటే. టికెట్ వచ్చినా, రాకపోయినా పార్టీ పట్ల విధేయతతో ఉండడం నేర్చుకోవాలి. చంద్రబాబునాయుడు గారు మాకు భగవంతుడు. ఇవాళ సీటు ఇవ్వలేదని ఆయనను వ్యతిరేకించడమో, ఇంకేదో మాట్లాడడమో చేసే క్యారెక్టర్ కాదు మాది. మేం బలహీన వర్గాలకు చెందిన వాళ్లం. ఒకపూట భోజనం పెడితేనే వాళ్ల పట్ల అంకితభావంతో ఉండేవాళ్లం మేము. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా జీవితాంతం చంద్రబాబుకు విధేయులుగానే ఉంటాం. 

చంద్రబాబు అంటే నాకు ప్రేమ. అందుకే రక్తంతో ఆయన పాదాలు కడిగాను... భారతదేశంలో అదొక చరిత్ర. దాన్ని కొందరు పాజిటివ్ గా తీసుకుంటారు, కొందరు నెగెటివ్ గా తీసుకుంటారు. ఏదేమైనా చంద్రబాబు మాకు దైవ సమానులు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటాం. నేనంటే గిట్టనివాళ్లు, శత్రువులే చంద్రబాబుపై నేను ఒత్తిడి పెంచుతున్నానని ప్రచారం చేస్తుంటారు" అని వివరించారు.


More Telugu News